మంచేరియల్, 29-07-2026
గోదావరిఖనిలో భారీ వర్షాల కారణంగా ఆర్ఎఫ్సీఎల్ ప్రాంతం నుంచి వీర్లపల్లి గ్రామంలోకి వరద నీరు చేరడంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సహాయం కోసం డయల్-100కు కాల్ చేయాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్ఎఫ్సీఎల్ ప్రాంతంలోని వరద నీరు డ్రైనేజీ కాలువల ద్వారా వీర్లపల్లి గ్రామంలోకి చేరింది. ఈ నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ పరిశీలనలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌రావు, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం, భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం అధికంగా ఉన్నందున ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ఇండ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉన్నట్లయితే వెంటనే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం పోలీసులు 24×7 అప్రమత్తంగా ఉండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, నదుల్లో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున వాటి వద్దకు ఎవరూ వెళ్లరాదని సూచించారు. గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
వర్షపు నీటి కారణంగా రహదారులపై వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతో, అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు, నదుల వద్దకు సెల్ఫీలు దిగడానికి లేదా ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించేందుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100కు కాల్ చేయాలని లేదా సమీపంలోని స్థానిక పోలీసు అధికారులను సంప్రదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.












