హైదరాబాద్, 2026-11-28
ఎల్నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో చెరువులు, జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుని చెరువులు, జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, రానున్న ఏడు నెలల్లో ఆవిరయ్యే నీటి పరిమాణం, చేపల పెంపకానికి అనుకూలంగా ఉండే నీటి లభ్యతపై అంచనాలు రూపొందించాలని సూచించారు.
తగినంత నీటి నిల్వలు ఉన్న చెరువులు, జలాశయాల వివరాలను మత్స్యశాఖకు అందజేయాలని, ఆయా నీటి వనరుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.
వారం నుంచి పది రోజుల్లోగా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ మత్స్యకారుల ఉపాధి, ఆదాయానికి విఘాతం కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.


