ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అర్జిదారుల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, రెవెన్యూ ఇంచార్జ్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావులతో కలిసి ప్రజావాణిలో ప్రజల సమస్యలను ఆలకించారు. అనేక మంది అర్జిదారులు తమ భూమి సమస్యలు, అక్రమ పట్టాల వ్యవహారాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి, నిర్మాణ అనుమతులు వంటి వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు.
కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం సంతోష్, తన కుటుంబానికి చెందాల్సిన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. లక్షెట్టిపేట మండలానికి చెందిన ఆపు నూరి రాయలింగు, భూమి రికార్డులలో నమోదైన పొరపాటును సరిచేసి, పట్టా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేట మండలానికి చెందిన మెండ్రపు లక్ష్మి, భర్త మరణానంతరం ఆస్తి వ్యవహారాలపై ఫిర్యాదు చేశారు.
బెల్లంపల్లి మాజీ కో ఆప్షన్ సభ్యుడు అన్వర్ ఖాన్, డంపింగ్ యార్డ్ స్థలం కబ్జాపై హైకోర్టు ఆదేశాల అమలు కోరారు. చెన్నూర్ మండలానికి చెందిన అయిత రామ్ రెడ్డి, భూమి రికార్డుల నమోదుపై, పిల్లల మర్రి సంధ్య, ఇల్లు కట్టుకోవడానికి స్థలం కేటాయింపుపై దరఖాస్తు చేశారు. మందమరి మండలానికి చెందిన చాట్ల సుగుణ, ఇంటికి నెంబర్, ఎన్.ఓ.సి. మంజూరు కోరగా, పల్లె మల్లేష్, అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 60 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.


