రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో ఉన్న హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు స్టేషన్ పనితీరు, రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
డీసీపీ ఎగ్గడి భాస్కర్ పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో ఆన్లైన్ వివరాల నమోదు ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతిపై సీఐ రవీందర్, ఎస్ఐ కిరణ్ కుమార్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాల ఫుటేజీని నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి కానిస్టేబుల్ గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు.
ప్రజల్లో చట్టాలపై, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై, సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. అలాగే రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం యొక్క ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి ప్రాముఖ్యతపై ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు.
హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవే అథారిటీతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐల పనితీరును అభినందించిన డీసీపీ, ఇదే స్ఫూర్తితో మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.












