మంచేరియల్, 2026-07-28
మంచిర్యాల పట్టణంలోని అడ్డా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక స్థలం, షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల పట్టణంలోని అడ్డా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు.
పట్టణంలో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు ప్రతిరోజూ ఓవర్ బ్రిడ్జి ప్రాంతం, ముక్రం చౌరస్తా వద్ద రోడ్లపై నిలబడి పనుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక అడ్డా స్థలం లేకపోవడంతో ఎండ, వర్షం, ట్రాఫిక్ రద్దీ మధ్య తీవ్ర ఇబ్బందులు పడుతూ, ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే అడ్డా కార్మికుల కోసం శాశ్వత ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని, ఆ స్థలంలో వర్షం, ఎండ నుంచి రక్షణ కల్పించే షెడ్లు నిర్మించాలని, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, మహిళలు–పురుషుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, కూర్చునేందుకు బెంచీలు వంటి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కార్మికులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అడ్డా స్థలాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసి, కార్మికులు గౌరవప్రదమైన, సురక్షితమైన వాతావరణంలో పనుల కోసం వేచి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్ఎంఎస్ జిల్లా కమిటీ చేసిన ఈ డిమాండ్లను మేయర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి సాయి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి షఫీ, నాయకులు ఎండి హుస్సేన్, అగ్గు మహేష్, పల్లపు శ్రీనివాస్, పెద్దపల్లి సూరయ్య, కొండు రాజు, గుండ్ల లక్ష్మణ్, దున్నపోతుల రమేష్, ముడేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.











