జిల్లా ప్రజల నుంచి స్వీకరించిన సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు.
లక్షెట్టిపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం సాదాబైనామా దరఖాస్తులు, భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను ప్రవేశపెట్టిందని, దీని ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
సాదాబైనామా దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పకడ్బందీగా విచారించి, పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం, లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదామును సందర్శించి, కొనుగోలు చేసిన వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని, నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే గోదాములకు తరలించాలని, దిగుమతికి సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
మందమర్రి మండలంలోని సప్తగిరి రైస్ మిల్లును కూడా సందర్శించి, కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని నిలువ చేయడానికి గోదాముగా మార్చే అవకాశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.












