గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్తో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలను కేటాయించాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ మేరకు తీర్మానం చేశారు. హైదరాబాదు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో బుధవారం సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ వైఖరి వంటి అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అన్ని కేటగిరీల జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో 200 చదరపు గజాల చొప్పున స్థలాలు కేటాయించాలని సొసైటీ కోరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం పట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.
సొసైటీలో సభ్యత్వం పొందిన సుమారు 1350 మంది జర్నలిస్టులు గత 18 ఏళ్లుగా స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, కొందరు జర్నలిస్టులు స్థలం పొందకుండానే మృతి చెందారని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ, రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ జర్నలిస్టుల సంక్షేమంపై ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ జీవోల ద్వారా అయినా జర్నలిస్టు సొసైటీలకు స్థలాలు కేటాయించాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఎమ్మెల్సీ కోదండరాం, రాజ్యసభ సభ్యులు ఎం. అనిల్ కుమార్ యాదవ్ తమ మద్దతును ప్రకటించారు. సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ నివేదికను సమర్పించారు. ఈ సమావేశంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.












