మంచేరియల్, జూన్ 29, 2026
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా సేకరించిన ఓటర్ల వివరాలను బీఎల్ఓ యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డులలో జరుగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించి, అధికారులకు సూచనలు ఇచ్చారు. జూలై 24 వరకు ఇంటింటి కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు అందించి ఓటర్ల నుండి సేకరించిన సమాచారాన్ని బీఎల్ఓ యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 21, 15 వార్డులలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను మండల తహసిల్దార్ సతీష్ కుమార్, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అందిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ఓటర్ల నుండి సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. జూలై 24వ తేదీ వరకు నిర్వహించే సమగ్ర సవరణ ఇంటింటి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, ఈ క్రమంలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించినప్పుడు బీఎల్ఓ యాప్లో మార్క్ చేయాలని తెలిపారు.
సదరు ఓటరు ఎన్యుమరేషన్ ఫారం నింపిన తరువాత తిరిగి సేకరించి యాప్లో వివరాలు నమోదు చేయాలని, మరణించిన వారు, గ్రామం వదిలి వెళ్ళిన వారు, 2 అంతకు మించి ఎపిక్ కార్డులు కలిగి ఉండడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఒకరికి ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే ఉండేలా స్పష్టమైన జాబితా రూపొందించాలని, ఎన్యుమరేషన్ ఫారాలు నింపిన తరువాత తిరిగి సేకరించి బీఎల్ఓ యాప్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.












