ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం హాజీపూర్ మండలం రాపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో ప్రత్యేక సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. వర్షం తక్కువగా ఉన్నందున తదనుగుణంగా సాగు చేయగల పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలని, ఆ దిశగా వ్యవసాయ, విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. యూరియా పంపిణీకి సంబంధించి యాప్ లో నమోదు చేయబడిన రైతులు, పంట, సాగు వివరాలకు అనుగుణంగా విడతల వారీగా యూరియా అందించడం జరుగుతుందని తెలిపారు.
ఒకే రకమైన పంట సాగు చేయడం వలన భూసారం తగ్గుతుందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, నానో యూరియా, డి ఎ పి, ప్రభుత్వం చేవీకరించబడిన విత్తనాలను మాత్రమే రైతులు వినియోగించాలని కలెక్టర్ సూచించారు. భూమి రకాన్ని బట్టి పత్తి పంట ఎకరానికి 14 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, రైతులకు మద్దతు ధర అందించడం జరుగుతుందని తెలిపారు. చిన్న, సన్న కారు రైతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటల సాగుపై దృష్టి సారించాలని, పంట సాగుకు ప్రభుత్వం రాయితీ అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని సూచించారు.
పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టడం ద్వారా ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎలాంటి డెంగ్యూ కేసులు నమోదు కాలేదని, ఇలాగే కొనసాగించినట్లయితే వ్యాధుల నియంత్రణ సులభతరం అవుతుందని తెలిపారు. ప్రతిరోజు తడి, పొడి చెత్తను సేకరించాలని, ఉపయోగపడే వ్యర్ధాల ద్వారా కంపోస్టు చేసి రైతులకు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం, జనగణన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, జన గణన ప్రక్రియలో వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.
విద్యావవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. జూనియర్ కళాశాలలలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, ఈ విద్యా సంవత్సరం వార్షిక ఫలితాలలో దాదాపు 98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. ఈ వేసవిలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు కార్యాచరణతో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వైద్యం, విద్య, మహిళా రక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల తహసీల్దార్ల దృష్టికి తీసుకురావచ్చని, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందని తెలిపారు.










