బాల్య వివాహాలను అరికట్టడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో, మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో డిసిపి భాస్కర్ కూడా పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని ఆయన అన్నారు. చట్ట ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహాలు చేయడం నేరమని గుర్తు చేశారు.
తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, బాల్య వివాహాలను నివారించడంలో క్రియాశీలకంగా పాల్గొనాలని ఆయన కోరారు. బాల్య వివాహాల దుష్ప్రభావాలు, నివారణ చర్యలపై రూపొందించిన గోడ ప్రతులను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












