మంచేరియల్, 04-07-2026
మంచిర్యాలలోని విశ్వనాథ్ ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆలయ పాలకవర్గ చైర్మన్గా ఇప్పటివరకు అగ్రవర్ణ వైశ్యులకే అవకాశం కల్పిస్తున్నారని, ఇది బీసీలపై వివక్షకు నిదర్శనమని ఆయన ఆరోపించారు.
మంచిర్యాలలోని విశ్వనాథ్ ఆలయం ఎండోమెంట్స్ శాఖ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయ పాలకవర్గ చైర్మన్గా ప్రధానంగా అగ్రవర్ణ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే నియమిస్తున్నారని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా ఇదే ఆనవాయితీ కొనసాగడం బీసీలపై జరుగుతున్న వివక్షకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
పాలకవర్గ చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలలో అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని శ్రీనివాస్ ఆరోపించారు. అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు విశ్వనాథ్ ఆలయ పాలకవర్గ చైర్మన్గా ఉండేందుకు అర్హులు కారా? విశ్వనాథ్ ఆలయం కేవలం అగ్రవర్ణాల ఆలయమా? అని ఆయన ప్రశ్నించారు.
ఆలయం ఎండోమెంట్స్ శాఖ పరిధిలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలని, కానీ ఇన్నేళ్లుగా ఒకే వర్గానికి చెందిన వ్యక్తులకే బాధ్యతలు అప్పగించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా అగ్రవర్ణాల ఆధ్వర్యంలో ఆలయ పాలన కొనసాగినా, ఆలయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం దీప, ధూప, నైవేద్యాల నిర్వహణకే ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొనడం వారి పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఆలయాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారో మంచిర్యాల ప్రజలందరికీ తెలుసని అన్నారు.
ఇప్పటికైనా విశ్వనాథ్ ఆలయ పాలకవర్గాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యంతో ఏర్పాటు చేసి, పాలకవర్గ చైర్మన్ పదవిని అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే గతంలాగే అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే చైర్మన్లుగా నియమిస్తే, వారి ఆధిపత్యం కారణంగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన భక్తులు ఆలయానికి దూరమయ్యే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు.
ఇప్పటికే ఆలయ ఆదాయం గణనీయంగా తగ్గిందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయ అభివృద్ధి పూర్తిగా కుంటుపడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కావున విశ్వనాథ్ ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించి, పాలకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ సమాజ్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.











