భారత్-ఖతార్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక చర్చలు జరిపారు. దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీతో సమావేశమైన ఆమె, భారత్‌లో ఖతార్ ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి అమలు, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, యూపీఐ విస్తరణ వంటి అంశాలపై దృష్టి సారించారు.
ఖతార్‌లో భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలను మరింత విస్తరించే అంశంపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. ఖతార్‌లో యూపీఐ ఇప్పటికే కొన్ని పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాల్లో అందుబాటులో ఉండగా, దేశవ్యాప్తంగా దాని వినియోగాన్ని విస్తరించే దిశగా భారత్, ఖతార్ గతంలోనే అంగీకరించాయి.
అలాగే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బీఐటీ)ను త్వరగా ఖరారు చేయడం, భారత్‌లో ఖతార్ పెట్టుబడులకు సంబంధించిన కట్టుబాట్ల అమలు, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో ఖతార్ మరింతగా భాగస్వామ్యం కావడం వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో మరింత స్పష్టత కోసం ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం గురించి కూడా చర్చించారు.
ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్‌తో జరిగిన చర్చల్లో భారత్-ఖతార్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. రెండు దేశాల మధ్య సాధారణ వాణిజ్య కార్యకలాపాలు, సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది.
2016లో భారత్, ఖతార్ తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయి. అదే సమయంలో ఖతార్ భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడికి కట్టుబాటును ప్రకటించింది. మౌలిక వసతులు, సాంకేతికత, తయారీ తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు దృష్టి సారించాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి 29 వరకు దోహాలో పర్యటించి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాల ఆర్థిక మంత్రులతో కూడా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.










