1975 నాటి ఎమర్జెన్సీకి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పౌరహక్కుల సంఘం (CLC) ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "ఇందిరా ఎమర్జెన్సీ నుండి మోడీ ఆపరేషన్ కగార్ వరకు – పౌరహక్కుల ఉల్లంఘనలు" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంకూరి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, 1975 నాటి ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని వక్తలు పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసి, విభిన్న అభిప్రాయాలను అణచివేసి, వేలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలను జైళ్లకు పంపిన ఘటనలను వారు గుర్తు చేశారు.
ప్రస్తుతం దేశంలో భిన్న రూపాల్లో అదే నిర్బంధ ధోరణులు కొనసాగుతున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేస్తూ, విభిన్న స్వరాలను దేశద్రోహం, ఉగ్రవాదం పేరుతో అణచివేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా "ఆపరేషన్ కగార్" పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న సైనిక చర్యలు స్థానిక ప్రజల జీవన హక్కులను, రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు.
దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. పౌరహక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, సంఘటిత హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య సంఘటన ఉద్యమాల ద్వారా బీజేపీని గద్దె దించడానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యార్థి, యువజన, మహిళలు ఏకం కావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.












