మంచేరియల్, 2026-07-28
ప్రపంచ హెపటైటిస్ బి కాలేయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రపంచ హెపటైటిస్ బి కాలేయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, జిల్లాలోని బ్లడ్ బ్యాంకులు, ప్రైవేటు ఆసుపత్రులలో కాలేయ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
కాలేయానికి సంబంధించిన వైరస్ 'ఏ, బి, సి, డి, ఈ' ద్వారా వస్తుందని, ముఖ్యంగా కలుషిత రక్తం, కలుషిత సూదులు, తల్లి నుండి బిడ్డకు, అలాగే స్వచ్ఛమైన నీరు, ఆహారం తీసుకోని పరిస్థితుల్లో ఈ వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఇది ఒక మౌన వ్యాధి అని, లక్షణాలు లేకపోయినా కాలేయానికి నష్టం చేస్తుందని, దీనివల్ల జీర్ణశక్తికి సమస్యలు వచ్చి ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు.
మత్తు పదార్థాలు, మద్యపానం సేవించడం, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిస్పోజల్ సిరంజిలను వాడాలని, ప్రతి ఆపరేషన్‌కు ముందు, శస్త్ర చికిత్సలకు ముందు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మందులు వాడడం, ఆరోగ్య అవగాహన కలిగించడం ద్వారా కాలేయ సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని అన్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ ఈ వ్యాధి గురించి తెలుసుకొని, పరీక్ష చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంకు వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తమ పరిధిలో పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైరల్ జిల్లా కోఆర్డినేటర్ మధు, సీహెచ్‌వోలు పుట్ట సత్తయ్య, కాకిరాల వెంకటేశ్వర్లు, నామ్‌దేవ్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ అమన్, డాక్టర్ రమ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.












