మంచేరియల్, 2026-07-02
తెలంగాణ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచిన సింగరేణి కాలరీస్ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి నిలయంగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన 'సింగరేణి పరిరక్షణ సదస్సు'లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో జరిగిన వందల కోట్ల కుంభకోణాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.
తెలంగాణ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచిన, 137 ఏళ్ల ఘన చరిత్ర గల సింగరేణి కాలరీస్ సంస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి నిలయంగా మార్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘సింగరేణి పరిరక్షణ సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగినట్లు చెబుతున్న వందల కోట్ల కుంభకోణాలను ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు.
సదస్సులో హరీశ్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసమే సింగరేణి ఓవర్ బర్డెన్ (ఓబీ) టెండర్లలో నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చారని ఆరోపించారు. అర్హులైన ఇతరులకు అవకాశం దక్కకుండా ఉండేందుకు ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చి, ఆ కాంట్రాక్టులను సీఎం బంధువులకు కట్టబెట్టారని మండిపడ్డారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో దేశవ్యాప్తంగా భారీ అవినీతి జరిగిందని ఆయన గణాంకాలను వివరించారు. మార్కెట్ ధర ప్రకారం ఎన్టీపీసీ, హెచ్పీసీ వంటి సంస్థలు ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. కానీ సింగరేణిలో 67 మెగావాట్ల సోలార్ ప్లాంటు నిర్మాణానికి మెగావాటుకు రూ. 7 కోట్ల చొప్పున టెండర్లు కేటాయించి, కాంట్రాక్టర్లకు రూ. 280 కోట్లు అదనంగా దోచిపెట్టారని ఆరోపించారు. వీరికి ముందస్తుగా 10 శాతం ‘మొబిలైజేషన్ అడ్వాన్స్’ ఇచ్చి కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. అదేవిధంగా 107 మెగావాట్ల సోలార్ ప్లాంటుకు సైతం మెగావాటుకు రూ. 5.40 కోట్ల చొప్పున టెండర్లు ఇచ్చి, మరో రూ. 214 కోట్ల మేర సంస్థకు నష్టం చేకూర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరగడం లేదని, కానీ కాగితాలపై మాత్రం ఉత్పత్తి పెరిగినట్లు, లాభాలు వచ్చినట్లు చూపిస్తూ ఐటీ (ఆదాయపు పన్ను) కడుతూ సంస్థ నిధులను వృథా చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. జెన్కో ప్లాంట్లలో కనీసం 25 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా, తీవ్ర కొరత ఏర్పడిందని.. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించారు. బొగ్గు కొరత కారణంగానే కొత్తగూడెం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని స్పష్టం చేశారు. అలాగే, పీపీఆర్, పీపీఏ అనుమతులు లేకుండానే జైపూర్ పవర్ ప్లాంట్ (800 మెగావాట్లు) కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేశారని, ప్రస్తుతం అది మూతపడటంతో రోజుకు రూ. 2 కోట్ల నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.










