దేశంలో ఎన్నికల వ్యవస్థను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఓటు హక్కును పరిరక్షించుకోవడంలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీఎల్ఏ-2 సమావేశంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ముందుగానే హెచ్చరించినట్లుగా ఓటు చోరీ జరుగుతోందని, రాజ్యాంగ నిర్మాత కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.
నీట్ పరీక్షల నిర్వహణపై కూడా ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. వరుస పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ, బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, యువత విద్య, ఉపాధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై స్పందన, రాబోయే రాజకీయ కార్యాచరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








