పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ, జిల్లా ఉపాధి అధికారితో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. సుమారు 200 మందికి పైగా ప్రజలు హాజరై తమ వినతులను సమర్పించారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజల నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై ఎంపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో నేరుగా మాట్లాడి, పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే లోన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
యువతకు ఉపాధి అవకాశాలపై కూడా ఎంపీ అధికారులకు సూచనలు చేశారు. జిల్లా ఉపాధి అధికారికి యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నమోదు చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.










