హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, మృతురాలిని సుష్మా చౌదరి (28)గా గుర్తించారు. ఆమె తన స్నేహితుడు కొతిలి అక్షయ్ కుమార్‌తో కలిసి మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని ఒక స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, బుధవారం తెల్లవారుజామున సుష్మా, అక్షయ్ కుమార్ కలిసి బుల్లెట్ బైక్‌పై కొండాపూర్‌కు తిరిగి ప్రయాణమవుతున్నారు.
ఈ క్రమంలో, చిన్న పెద్దమ్మ ఆలయం సమీపంలోని సీఐఐ జంక్షన్ వద్దకు చేరుకోగానే, బైక్ అదుపుతప్పి ముందుగా రోడ్డు డివైడర్‌ను, ఆ తర్వాత ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ వెనుక కూర్చున్న సుష్మా రోడ్డుపై ఎగిరి పడిపోయారు. ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై సుష్మా స్నేహితుడు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బైక్ నడుపుతున్న అక్షయ్ కుమార్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


