డ్రగ్స్ మరియు నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు. బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజా అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా బెల్లంపల్లి-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో ప్రజా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు కుటుంబానికి, సమాజానికి భారంగా మారతారని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు.
పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, సోషల్ మీడియా మోసాలు, ఫేక్ లింకుల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి వేధింపులు, గృహ హింస, సైబర్ వేధింపులు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలు, బాలికలకు సూచించారు. డ్రగ్స్ రహిత, నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం కీలకమని, అప్పుడే శాంతిభద్రతల పరిరక్షణ సమర్థవంతంగా సాధ్యమవుతుందని డీసీపీ పేర్కొన్నారు.











