మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేరు 'బకాయిల విక్రమార్క' అని తీవ్రంగా విమర్శించారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, TBGKS రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివాకర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు.
సింగరేణిలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శలను ఆయన ఖండించారు. అబద్ధాలు ఆడేది హరీష్ రావు కాదని, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలేనని, వారు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై అబద్ధాలు ఆడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. దేవుళ్ళపై ఒట్టు వేసి ఇచ్చిన హామీలను మరిచి, ప్రజలకు బాకీ ఉన్నారని, అందుకే బట్టి విక్రమార్క పేరు 'బకాయిల విక్రమార్క' అని మార్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మంచిర్యాల పర్యటనలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గొప్పవారని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రేమ్ సాగర్ రావును ఆదర్శంగా తీసుకోవాలని అనడం ద్వారా గుండాయిజం, రౌడీయిజం, దాడులు, భూకబ్జాలు చేయాలని ప్రేరేపిస్తున్నారా అని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాలలో ప్రేమ్ సాగర్ రావు బ్యాంకులకు 500 కోట్ల రూపాయల అప్పులు చెల్లించారంటే మంచిర్యాల నియోజకవర్గంలో ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసునని, ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యేల వరకు అందరూ అక్రమాలకు, అవినీతికి పాల్పడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు.
మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలు చేసినా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన నిధులతో పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఆలయ అభివృద్ధిని అడ్డుకున్నారని, ఆలయం ముందు షాపులను కూల్చివేయడం వల్ల ఆదాయ నష్టం వాటిల్లిందని తెలిపారు. వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన ప్రేమ్ సాగర్ రావు లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే తెలంగాణ నాశనమవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి స్థలాలలో నివాసముంటున్న వేలాది మందికి ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, అయితే గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు భూమి ఇస్తానని ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలందరూ కోపంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు. కారుణ్య నియామకాలు ఇచ్చే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, కారుణ్య నియామకాలు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ గొప్పతనాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. ఈ విధంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుందని ఆయన జోస్యం చెప్పారు.












