మంచేరియల్, 14-07-2026
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు, 82 ఏళ్ల వృద్ధురాలు, బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను బీసీ సమాజ్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ హెచ్చరించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బోర్డు సభ్యురాలు, 82 ఏళ్ల వృద్ధురాలు, బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తోంది. కుల అహంకారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందా అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నరెడ్ల శ్రీనివాస్, ఒక వృద్ధ మహిళను, అదీ బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని కేవలం తన తండ్రి ఫోటో ఫ్లెక్సీలో లేదనే కారణంతో అవమానించడం అత్యంత నీచమైన, కుల అహంకారంతో కూడిన చర్య అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నమ్మకంతో ఒక బీసీ మహిళకు బాధ్యత అప్పగిస్తే, దానిని సహించలేక కుల దురహంకారంతో అవమానించడం బీసీల ఆత్మగౌరవంపై దాడి చేసినట్టేనని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో పదవులు కుటుంబ వారసత్వం వల్ల కాదు, అర్హత వల్ల వస్తాయని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి బర్తరఫ్ చేసి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ సమాజ్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను అవమానించే శక్తులకు అండగా నిలుస్తోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించి బీసీలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.
బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ప్రతి అవమానానికి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా గట్టి సమాధానం ఇస్తామని నరెడ్ల శ్రీనివాస్ హెచ్చరించారు.











