ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్ప అన్నారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు.
మంచిర్యాల పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మరియప్ప, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఆయుధమని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం, ఎన్నికల సంఘం తప్పిదాలకు శిక్షలు పడకుండా చట్టాలు రూపొందించారని ఆయన ఆరోపించారు.
పొట్ట చేతపట్టుకుని జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే సాధారణ ప్రజల ఓట్లను తొలగించడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కు, ఓటు హక్కుల పరిరక్షణ కోసం అధికారంలో ఉన్న బీజేపీపై పోరాటం చేస్తున్నారని తెలిపారు.
గతంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమం విజయవంతమైందని మరియప్ప గుర్తుచేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)కు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ రావు మాట్లాడుతూ దేశ ప్రజలకు సంబంధించిన అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.
ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రాఘనాథ్ రెడ్డి, మంచిర్యాల నగర కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మండల అధ్యక్షులు తోట రవి, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు జాలే రాయలింగు, చాతరాశి రాజేష్, డాక్టర్ సెల్ అధ్యక్షురాలు చందన, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


