మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన స్వాగత ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా సోమవారం ఎం-కన్వెన్షన్ హాల్ లో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమంగా అలంకరించిన మండపాలకు బహుమతులు అందజేశారు.
హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు దేగ రవీందర్ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్, కోశాధికారి ముత్యాల కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
వక్తల సందేశం
గణపతి నవరాత్రులు కేవలం పండుగ మాత్రమే కాదని, హిందూ ఐక్యతకు, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతీక అని వక్తలు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఈ ఏడాది గణనాథుల మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
యువత పాత్రపై పిలుపు
సనాతన ధర్మం అంటే కేవలం పూజలు మాత్రమే కాదని, సత్యం, ధర్మం, దయ, సేవ, మానవతా విలువల సమాహారమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో యువత ముందుకు రావాలని, మంచిర్యాలలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
ఐబీ చౌరస్తాలో స్వాగత ఉత్సవం
పట్టణంలో అభివృద్ధి పనుల కారణంగా గతంలో ముఖరం చౌరస్తాలో నిర్వహించే నిమజ్జన స్వాగత ఉత్సవాన్ని ఈ ఏడాది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో ఐబీ చౌరస్తాలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో విశాలంగా నిర్వహించామని, ఇకపై ప్రతి ఏడాది అక్కడే నిర్వహిస్తామని సమితి నాయకులు ప్రకటించారు.
అనంతరం ఉత్తమంగా అలంకరించిన మండపాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 0 కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన పోలీస్, విద్యుత్, మున్సిపల్ అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు, మీడియా ప్రతినిధులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఇరుకుల్ల సూర్యనారాయణ, రామగిరి శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండ సుధాకర్, గొనె శ్యాం సుందర్ రావ్, సతీష్ భవాని, అఘోర రఘు గురుస్వామి, గుర్రాల శ్రీధర్, పిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.











