శ్రీరాంపూర్ లోని 3 గని వద్ద సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నూతన పిట్ కమిటీ ఎన్నికైంది. పెద్ద సంఖ్యలో యువ కార్మికులు యూనియన్లో చేరారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించారు.
నూతన కార్యదర్శిగా సాయిళ్ళ శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీగా ఆషాడం రమేష్, మైన్ ఇన్చార్జిగా ఇత్తినేని వెంకటేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జిలుగా మాదాసు విజయ్, దొంతుల సాయి, జనరల్ షిఫ్ట్ ఇంచార్జిగా చీకట్ల సాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్.రాజేందర్, గుల్షన్ కుమార్, తోట విజయ్, ఏ రిలే ఇన్చార్జిగా వెంగళ శ్రీనివాసులను నియమించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సొంతింటి కల నెరవేర్పు కోసం సిఐటియు చేస్తున్న పోరాటాన్ని గమనించి, పెద్ద సంఖ్యలో యువత సిఐటియులో చేరుతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి నూటికి నూరుపాళ్లు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సింగరేణి యాజమాన్యం యువ కార్మికులను అవహేళన చేస్తోందని, అర్హత ఉన్న పనులకు కాకుండా వేలాది మందిని ఇతర పనులకు పంపిస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్హత ఉన్న క్లర్కులు, ఎస్పీసీ () పోస్టులు, ఇతర అంతర్గత నోటిఫికేషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించడం లేదని, అలాగే గత 14 ఏళ్లుగా రిక్రూట్మెంట్ చేయని ఎస్పీసీ పోస్టులను కూడా యువ కార్మికులు, కార్మికురాళ్లతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల అసమర్థత వల్ల ఖాళీలు ఉన్నప్పటికీ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంలో గుర్తింపు సంఘం విఫలమైందని, వేలాది మంది అర్హత ఉన్న కార్మికులు అంతర్గత నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అర్హతకు తగ్గ పని దొరక్క అసంతృప్తి పెరుగుతోందని, వారిని కౌన్సిలింగ్ చేసేటప్పుడు అసలు కారణాలు తెలుసుకొని వారికి తగిన పని కల్పించేలా చూడాలని సూచించారు. ప్రస్తుతం పనిచేస్తున్న యువతకు వారి విద్యార్హతలకు తగ్గట్లుగా సరైన పనులు అప్పగిస్తే, సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారు కృషి చేస్తారని అన్నారు.








