జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అతిసార వ్యాధి నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు జూన్ 1 నుండి జూలై 31 వరకు రెండు దశలలో నిర్వహించబడతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత తెలిపారు. సున్నా శిశు మరణాలను లక్ష్యంగా చేసుకుని, ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మొదటి దశలో భాగంగా, జూన్ 1 నుండి 15 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండవ దశలో, జూన్ 16 నుండి జూలై 31 వరకు ప్రతి గ్రామంలో ఓఆర్ఎస్, జింక్ డిపోలను ఏర్పాటు చేస్తారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఐదు సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి, వారి ఇళ్లలో ఓఆర్ఎస్ ద్రావణం అందుబాటులో ఉంచుతారు.
తల్లులకు, గర్భిణీ స్త్రీలకు అతిసారంపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి అంగన్వాడీ, ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్, జింక్ అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా రోటా వైరస్ టీకా అందరికీ అందేలా చూడాలని, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
మారుమూల గిరిజన ప్రాంతాలు, మురికివాడలు, వలస జనాభా ఉన్న ప్రాంతాలు, అనాధ ఆశ్రమాలలో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అతిసారం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందని, వెంటనే ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందించాలని, దానిని తయారు చేసే విధానం గురించి వివరించాలని తెలిపారు.












