సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యమని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ (జిఎం) రాధాకృష్ణ తెలిపారు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
మందమర్రి ఏరియాలో జరిగిన మల్టీ డిపార్ట్మెంట్ సమావేశంలో భాగంగా, జిఎం రాధాకృష్ణ రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
రోగులకు అత్యుత్తమ శ్రేణి చికిత్స అందించడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. రోగుల భద్రత విషయంలో రాజీ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి ఉన్న చరిత్రను కాపాడాల్సిన బాధ్యత వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై ఉందని జిఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ సిహెచ్ అశోక్, డీజీఎం ఐఈడీ కిరణ్ కుమార్, ఏరియా హాస్పిటల్ డివైసిఎంఓ మధు కుమార్, ఐడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్, ఆసుపత్రి సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.









