మంచేరియల్, 2026-06-27
అర్హత కలిగిన దివ్యాంగులకు మాత్రమే సదరం ధ్రువపత్రాలు జారీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో నిర్వహించిన సమీక్షలో శిబిరాల నిర్వహణ, యు.డి.ఐ.డి పోర్టల్ నమోదు, దివ్యాంగుల హాజరు వంటి అంశాలపై చర్చించారు.
సదరం - యు.డి.ఐ.డి శిబిరాల నిర్వహణలో అర్హత కలిగిన దివ్యాంగులకు మాత్రమే ధ్రువపత్రాలు జారీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం శిబిరాల నిర్వహణ, యు.డి.ఐ.డి పోర్టల్ పార్ట్-బి వివరాల నమోదు, హాజరు నమోదు, దివ్యాంగుల హాజరు, పోర్టల్‌లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి వైద్య శిబిరం అసెస్మెంట్ షెడ్యూల్ కేటాయింపు అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, ప్రతి నెలా నిర్వహించే సదరం-యు.డి.ఐ.డి శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని, అర్హత కలిగిన దివ్యాంగులకు మాత్రమే ధ్రువపత్రాలు జారీ చేయాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా పరిష్కరించాలని, ప్రతినెలా తప్పనిసరిగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ప్రతినెలా మండలానికి ఒక గ్రామం చొప్పున దివ్యాంగుల గుర్తింపు, సదరం ధ్రువపత్రం లేని వారికి మీ-సేవలో నమోదు, లోకో మోటార్, ఈఎన్టీ, కంటి శిబిరాల నిర్వహణ, బేరా, సౌండ్ ప్రూఫ్ పరికరాల లభ్యత, వినియోగం అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మాట్లాడుతూ, మీ-సేవ ద్వారా సదరం శిబిరం కొరకు అందిన దరఖాస్తులను క్రమ సంఖ్య వారీగా పరిశీలించి అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్య పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తున్నామని, వైద్య పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.ఓ. శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












