ఆరోగ్యమే సంపద, యోగానే మార్గం అనే సందేశంతో గోదావరిఖని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ప్రదర్శించిన యోగా ఆసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వేగవంతమైన జీవనశైలిలో యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, యోగా శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే గొప్ప భారతీయ సంస్కృతి సంపద అని, ఒత్తిడితో కూడిన జీవనంలో ఆరోగ్యకరమైన జీవనానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా వైభవం విస్తరించడం గర్వించదగిన విషయమని ఆమె అన్నారు.
యోగ గురువు నరోత్తం రెడ్డి మాట్లాడుతూ, యోగా సాధన ద్వారా ఆరోగ్యంపై అవగాహనతో పాటు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తుచేసుకోవచ్చన్నారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, యువతలో ఆత్మవిశ్వాసం, ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు యోగా పట్ల ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాయి. ఈ కార్యక్రమంలో యోగా గురువు రజనీ, బీజేపీ సీనియర్ నాయకులు సులువ లక్ష్మీనారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు ఉరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.












