దోమల ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధులను అరికట్టేందుకు పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు.
వర్షాకాలంలో మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా, అవి సక్రమంగా ప్రవహించేలా చూడాలని, దోమల నివారణకు బ్లీచింగ్ పిచికారి, ఆయిల్ బాల్స్, స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, డ్రై డే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి తొలగించాలని, వీధులు, మురుగు కాలువలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మలేరియా పరీక్షల కోసం ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఉచిత రక్త పరీక్ష కిట్లు, మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.










