ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, వైద్య సేవలను, వసతులను ఆయన పరిశీలించారు.
లక్షెట్టిపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులు, రిజిస్టర్లు, ల్యాబ్, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. అధికంగా నమోదవుతున్న వ్యాధులు, అందిస్తున్న చికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తూ, అత్యాధునిక పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు.
వర్షాకాలంలో వ్యాధుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని, మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వెంకటరావుపేట గ్రామంలో కలెక్టర్ పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల నమోదు, సేకరణలో జాగ్రత్త వహించాలని, ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు.












