చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. పోషణ్ పక్వాడ 8వ విడత కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ 8వ విడత కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 9 నుండి 23వ తేదీ వరకు నిర్వహించబడిందని ఆయన తెలిపారు.
పిల్లలలో మొదటి 6 సంవత్సరాల కాలంలో మెదడు అభివృద్ధి గరిష్టంగా ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక శ్రద్ధ వహించామని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం అత్యవసరమని, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు సరైన ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించవచ్చని ఆయన నొక్కి చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, గర్భిణులు, బాలల పోషకాహారంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. తొలి వేయి రోజులలో సరైన పోషణ, శిశు అభివృద్ధిపై దృష్టి సారించాలని, అంగన్వాడి కేంద్రాల ద్వారా ఆటల ఆధారిత విద్యను ప్రోత్సహించాలని తెలిపారు.
పోషణ పంచాయతీలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పిల్లలలో స్క్రీన్ టైమ్ తగ్గించే దిశగా తల్లిదండ్రులకు మార్గదర్శకాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీమంతం, అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ ధ్రువపత్రాల అందజేత కార్యక్రమాలను ఆయన సందర్శించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా స్థానిక సమాజం, తల్లులు, సంరక్షకులను భాగస్వామ్యం చేస్తూ పోషకాహారంపై ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.










