క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ, క్యాన్సర్ రన్లో వారు పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ప్రజారోగ్యం కోసం గ్రేస్ ఫౌండేషన్ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని అన్నారు. క్యాన్సర్‌పై అవగాహనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
క్యాన్సర్‌పై పోరాటం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ బాధ్యత మాత్రమే కాదని, సమాజమంతా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. భారతదేశం నుంచి క్యాన్సర్ మహమ్మారిని తరిమివేసే మహా యజ్ఞంలో యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు
క్యాన్సర్ మహమ్మారిని సమాజం నుంచి పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వంతో పాటు ప్రజలు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం, వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించడం, ముందస్తు గుర్తింపు పరీక్షలను ప్రోత్సహించడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స మెరుగ్గా పనిచేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
క్యాన్సర్ రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని, ప్రజల్లో అవగాహన పెంచుతూ, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రేస్ ఫౌండేషన్ నిర్వాహకులకు, పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, పోలీసు అధికారులకు, యువతీ యువకులకు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ లు అభినందనలు తెలిపారు.












