మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్. పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపల్ జి. అనూష, అధ్యాపక బృందంతో కలిసి అడ్మిషన్లకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 నుండి ఈ కళాశాల అత్యుత్తమ ఫలితాలతో విద్యను అందిస్తోందని పేర్కొన్నారు.
కళాశాలలో ఉన్నత విద్యతో పాటు, పోటీ పరీక్షల శిక్షణ, విద్యార్థుల మానసిక వికాసం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బి.ఎ., బి.కామ్., బి.ఎస్.సి. వంటి వివిధ కోర్సులను అందిస్తున్నారని, నిష్ణాతులైన మహిళా అధ్యాపకులచే బోధన జరుగుతుందని వివరించారు.
విద్యార్థులకు కాస్మెటిక్ చార్జెస్, యూనిఫామ్, ట్రాక్ షూ, నోట్ బుక్స్, స్పోర్ట్స్ షూ, స్టేషనరీ వంటివి ఉచితంగా అందిస్తామని కళాశాల అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, మెనూ ప్రకారం భోజనం, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, ఎన్.ఎస్.ఎస్. యూనిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా కళాశాల కార్యాలయంలో లేదా https://rdcmncl.blogspot.com/2026/04/application-for-degree-first-year-2026.html వెబ్ సైట్ లో ఈ నెల 25వ తేదీలోగా సమర్పించాలి. ఈ నెల 27న కౌన్సిలింగ్, జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.



