రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల ఆధార్ నమోదు వంటి అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో, పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ఇతర సదుపాయాలను కల్పించాలని సూచించారు. నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యా సంవత్సరంలో ఫలితాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, గత ఫలితాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని యోగితా రాణా సూచించారు. ప్రతి విద్యార్థికి ఆధార్/ఆపార్ నమోదు తప్పనిసరిగా చేయాలని, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో 10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలలో అనుతీర్ణులైన వారికి సరైన శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదుపాయాలు కల్పించడంతో పాటు, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యా శాఖ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.








