ఈ నెల 21న మంచిర్యాల జోన్లో జరగనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్ కోసం అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించి, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలపై చర్చించి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసు సిబ్బంది, హోంగార్డులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా, భద్రపరచడం, సమాధాన పత్రాలను సురక్షితంగా తిరిగి డిపాజిట్ చేయడం వంటి ప్రక్రియలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు.
నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను పూర్తిస్థాయిలో సురక్షితంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయంగా పనిచేస్తారని సీపీ తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఆదివారం నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. గతంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన కారణంగా ఈ రీ-ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 1,204 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, వారి కోసం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోని ప్రతి గదిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా, పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ప్రశ్నాపత్రాల రవాణా, భద్రపరిచే ప్రక్రియలను నిర్దేశిత నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లే, ఈసారి కూడా పోలీసు శాఖ, పరీక్ష నిర్వహణ సంస్థ, విద్యాసంస్థల సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లాలో నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.











