జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య లతో కలిసి కలెక్టర్ నీట్ పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులను నిబంధనల ప్రకారం పరిశీలించి లోపలికి అనుమతించాలని, పరీక్ష అనంతరం ఓఎంఆర్ పత్రాల తరలింపును అత్యంత జాగ్రత్తగా, నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు. ఈ ప్రక్రియలో పాలనా విభాగం, పోలీసు శాఖల నుండి నోడల్ అధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు.
పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, వైద్య-ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగ అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, పరీక్ష కేంద్రాల ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు.
నీట్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












