మంచిర్యాల పట్టణంలో నీట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన కేంద్రాలను బుధవారం మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ సందర్శించి, భద్రతా ఏర్పాట్లను, విద్యార్థుల సౌకర్యాలను సమీక్షించారు. మొత్తం ఐదు కేంద్రాల్లో 1,204 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, మంచిర్యాల జోన్ పరిధిలోని నీట్ పరీక్షా కేంద్రాలైన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహా పలు కేంద్రాలను సందర్శించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి, అధికారులకు ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
డీసీపీ మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో 1,204 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నామని, పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. పరీక్షా సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్, స్థానిక ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, సివిల్ పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రభుత్వ బస్సులతో పాటు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేపట్టామని, అవసరమైతే పోలీసు వాహనాలను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు.
మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఆ తర్వాత ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షలు ముగిసిన అనంతరం పరీక్షా సామగ్రిని పటిష్టమైన భద్రత మధ్య తరలిస్తామని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉందని, విద్యార్థులు ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్‌రావు పాల్గొన్నారు.










