ఇంటర్మీడియట్ పరీక్షలలో జిల్లా మైనారిటీ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ప్రతిభకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మైనారిటీ విద్యార్థులు రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
సోమవారం మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయాల భవనంలో జరిగిన కార్యక్రమంలో, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, ఆర్.ఎల్.సి. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా షగుఫ్తా ఫిర్దౌస్ లతో కలిసి కలెక్టర్ విద్యార్థులను సన్మానించారు. 2025-26 విద్యా సంవత్సరంలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ మైనారిటీ పాఠశాల, కళాశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కలెక్టర్ తెలిపారు.
భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత చదువులలో రాణించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడంలో అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ కృషిని కలెక్టర్ ప్రశంసించారు. వారి అంకితభావం విద్యార్థుల విజయానికి దోహదపడిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ తహరుద్దీన్, అకాడమిక్ సమన్వయకర్త రిజ్వాన్, మంచిర్యాల ప్రిన్సిపల్ సంధ్యా, బెల్లంపల్లి ప్రిన్సిపల్ యం.డి.నీలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తను మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారి జారీ చేశారు.






