మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు రామగుండం పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై విద్యార్థినులకు వివరించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మార్గదర్శకాలతో, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి నేతృత్వంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థినులకు మహిళల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై షీ టీమ్ సిబ్బంది సమగ్ర సమాచారం అందించారు.
ఈవ్-టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్ వినియోగం వంటి అంశాలపై విద్యార్థినులకు వివరించారు. మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని, ఇందుకోసం డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లను ఉపయోగించుకోవాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












