విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని గోదావరి ఒడ్డున గల పురాతన శ్రీ గౌతమేశ్వర ఆలయం వద్ద జమ్మి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పురాణాల ప్రకారం జమ్మి చెట్టుకు ఎంతో విశిష్టత ఉందని, విజయదశమి రోజున జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలు ఒకరికొకరు పంచుకుంటారని పండితులు తెలిపారు. గౌతమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.
భద్రతా ఏర్పాట్లు
జమ్మి పూజ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా గోదావరి ఒడ్డున, ఆలయ పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు.
ఈ సందర్భంగా ప్రజావార్త రిపోర్టర్ జక్కుల రాజు, మంచిర్యాల పట్టణ ఏసీపీ రామ్ ప్రకాష్, పట్టణ సీఐలకు జమ్మి ఆకులు ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసు శాఖ చూపిన చొరవతో జమ్మి పూజ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.









