రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, గోరక్షణ పేరుతో హింసకు పాల్పడవద్దని ఆయన హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించేందుకు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిందూవాహిని, శ్రీరామ్ సేన, హిందూ యువవాహిని సభ్యులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి వివరించారు.
కమిషనర్ ఆదేశాల మేరకు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8 కీలక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల వద్ద రాత్రింబవళ్లు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ, అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నారు. ఇది అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.
పశువుల అక్రమ రవాణా చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని, ఇది మూగజీవాల పట్ల క్రూరత్వానికి దారితీస్తుందని పోలీస్ కమిషనర్ నొక్కి చెప్పారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పశువుల రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, కౌ స్లాటర్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టాల కింద కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసే ప్రక్రియను చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
గోరక్షకుల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలు నిర్ధారించకుండా వాటిని పంచుకోవద్దని ప్రజలకు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597, డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.











