రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి, చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న విక్రేతపై పీడీ చట్టాన్ని అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన వూస సుబ్బారావు అనే వ్యక్తి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
వూస సుబ్బారావు రామగుండం కమిషనరేట్ పరిధిలోని పలు మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. తాండూర్ సీఐ దేవయ్య, ఎస్ఐ ప్రసాద్ నిందితుడికి పీడీ ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
సీపీ మాట్లాడుతూ, వూస సుబ్బారావు 2021 నుంచి 2025 వరకు గత ఐదు సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన అనేక క్రిమినల్ కేసుల్లో పాలుపంచుకున్నాడని తెలిపారు. నిందితునిపై గతంలో పీడీ చట్టం అమలు చేయగా, దానిని ప్రభుత్వం ధృవీకరించిందని పేర్కొన్నారు. పీడీ చట్టం అమలైన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకుండా అదే తరహా నేరాలకు పాల్పడుతూ మొత్తం తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాలను తీసుకువచ్చి అమాయక రైతులను మోసం చేస్తున్నాడని, ఏడాది వ్యవధిలో రెండుసార్లు పట్టుబడినట్లు వివరించారు. నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకోకుండా కొనసాగితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ చట్టాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు.










