రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రమేష్ హోటల్ యజమానులు, మేనేజర్లకు పలు కీలక సూచనలు జారీ చేశారు.
లాడ్జీలు, హోటళ్లలో బస చేసే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా ఆధార్ కార్డును పరిశీలించాలని ఆదేశించారు. గది బుక్ చేసుకునే వ్యక్తుల పూర్తి చిరునామా, ఫోన్ నంబర్, గుర్తింపు వివరాలు నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, లేదా పాత నేరస్తులుగా అనుమానం కలిగే వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కొంతమంది తప్పుడు సెల్‌ఫోన్ నంబర్లు ఇస్తున్నట్లు సమాచారం ఉందని, అందువల్ల ఫోన్ నంబర్లను కూడా ఒకసారి ధృవీకరించుకోవాలని సూచించారు.
లాడ్జీలు, హోటళ్లలో మద్యం సేవించడం లేదా బయట నుంచి తీసుకువచ్చి మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. బయట వ్యక్తులు వచ్చి పేకాట ఆడుతున్నారనే సమాచారం ఉందని, అలాంటి కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే మేనేజర్లు, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముఖ్యంగా మైనర్ బాలికలు, మహిళలు లేదా యువతులు లాడ్జీలు, హోటళ్లకు వచ్చినప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వారు ఏ ఉద్దేశంతో వచ్చారో నిర్ధారించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులతో వచ్చారా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలని, ఒంటరిగా వచ్చినట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పోలీసుల ఆదేశాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.









