మంచేరియల్, 01-08-2026
మహారాష్ట్ర నుంచి అక్రమంగా గడ్డి మందులను తరలించి, మంచిర్యాల జిల్లాలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను భీమిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.44 లక్షల విలువైన మందులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గడ్డి మందులను అక్రమంగా రవాణా చేసి రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను మంచిర్యాల జిల్లా భీమిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.44 లక్షల విలువైన 290 లీటర్ల గడ్డి మందులు, ఒక టయోటా ఇన్నోవా కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాండూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఈ వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు భీమిని ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
విచారణలో మహారాష్ట్రలోని రాజూరా నుంచి గడ్డి మందులను కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలో అక్రమంగా విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారని డీసీపీ చెప్పారు. గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వినియోగం వల్ల భూమి సారవంతం తగ్గడం, పర్యావరణానికి హాని కలగడం, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
రైతులు ప్రభుత్వం అనుమతించిన, లైసెన్సు కలిగిన దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా గడ్డి మందులను విక్రయిస్తున్న వారి గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.











