గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక మానవహారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, గోదావరిఖని వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలొద్దీన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్ తో కలిసి విద్యార్థులతో మానవహారంలో పాల్గొన్నారు.
మానవహారాన్ని ఉద్దేశించి ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యసనాన్ని శిక్షల ద్వారా కాకుండా చికిత్స ద్వారా నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు.
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువత, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












