సమాజం, యువత భవిష్యత్తును మాదకద్రవ్యాల నుండి కాపాడాలని, ఈ విషయంలో ప్రజల సహకారం అత్యవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల రూరల్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో, మంచిర్యాల జోన్లో సీసీసీ నస్పూర్ ఎన్.ఎన్. గార్డెన్లో మంచిర్యాల రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వినియోగం, దాని దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పు అని కమిషనర్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా వీటికి దూరంగా ఉండాలని సూచించారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ఈ దుష్ప్రభావాల నుండి రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకం వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కమిషనర్ ప్రజలను కోరారు. అందిన సమాచారం మేరకు డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం విస్తృత తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైల్వే, బస్ స్టేషన్లు, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై నిఘా పెంచామని, నిందితులను పట్టుకుంటున్నామని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి, కౌన్సెలింగ్ ఇచ్చి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు పంపుతున్నట్లు వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాల వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించగలమని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.










