జైపూర్ మండలంలోని రామారావుపేట గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించబడింది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపకల్పన మరియు అమలు కొరకు గ్రామ పంచాయతీ ప్రణాళికా సహాయక బృందం (GPPFT) మరియు గ్రామ పంచాయతీ సమన్వయ కమిటీ (GPCC)ల ఏర్పాటుపై చర్చించి, ఆమోదం తెలిపారు.
గ్రామసభకు హాజరైన గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, రైతులు మరియు సంబంధిత అధికారుల సమక్షంలో సర్పంచ్ పులి రాజశేఖర్ గారు గ్రామస్థుల భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరించారు. GPPFT మరియు GPCC కమిటీలు గ్రామ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యతల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కమిటీలలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు గారు మాట్లాడుతూ, రామారావుపేట నాణ్యమైన GPDP తయారీకి ఎంపిక చేయబడిన గ్రామాలలో ఒకటి అని, ఈ కమిటీల ఏర్పాటు ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని తెలిపారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శి శ్రీమతి డి రజిత గారు గ్రామ పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తూ, ఘన వ్యర్థాల నిర్వహణ కొరకు 4-బిన్ విధానం గురించి అవగాహన కల్పించారు. చెత్తను వేరు చేసి అందించడం ద్వారా గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు. అనంతరం, గ్రామస్థులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.












