తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్.ఐ. హైమ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో, ఉపాధి కూలీలకు మహిళలు, పిల్లల భద్రత, లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
వేధింపులకు గురైనప్పుడు వెంటనే డయల్ 100కు లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 6303923700కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్.ఐ. హైమ హామీ ఇచ్చారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతో పెరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, బాధితులు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
సమాజ అభివృద్ధికి లింగ సమానత్వం కీలకమని, మహిళలు, పురుషులు సమాన హక్కులు, అవకాశాలు పొందేలా కృషి చేయాలని కోరారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం ద్వారా సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని, ఇవి చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
18 సంవత్సరాల లోపు బాలికల వివాహాలు జరగకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్.ఐ. హైమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్, ఐ.ఈ.సి. నోడల్ ఆఫీసర్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.










