వరంగల్, 2026-06-05
ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలో నిర్వహించిన ఓరుగల్లు జానపద స్వరాల జల్లు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్ జానపద కళాకారుడు మామిండ్ల లక్ష్మణ్‌కు కీర్తి పురస్కారం - 2026 అందజేశారు. కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లోని పద్మశ్రీ, డా: నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వరంగల్ వారు ఓరుగల్లు జానపద స్వరాల జల్లు (కాకతీయ సకల కళల ఉత్సవాలు - 2026) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్ జానపద కళాకారుడు మామిండ్ల లక్ష్మణ్ గారికి ప్రముఖ సీనియర్ జానపద గాయకులు స్వర్గీయ వరంగల్ శంకర్, దీకొండ సారంగపాణిల కీర్తి పురస్కారం - 2026 అందజేశారు. వరంగల్ శంకరన్న, దీకొండ సారంగపాణి గార్ల ప్రియ శిష్యులు, వారి సమకాలీకులు, సీనియర్ గాయకులు అయిన జడల శివ, బి. శ్యామ్, డి. శ్రీకాంత్, సురెందర్ రావు, రంగనాథ్, జనగాం రాము, ప్రసాద్ రావు, మున్నా, తోట రవిందర్ గార్ల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మామిండ్ల లక్ష్మణ్ అందుకోవడం జరిగింది.
కళాకారుడి స్పందన
తనకు ఈ అరుదైన కీర్తి పురస్కారం లభించినందుకు మామిండ్ల లక్ష్మణ్ తన హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. జానపదమే తన ప్రాణపదంగా కళను మాత్రమే నమ్ముకొని, కళాకారుడిగానే తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తనకు హన్మకొండ వారు అందించిన ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.










