గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రజల భద్రత, నేరాల అదుపు లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పించారు.
గోదావరిఖని 1 టౌన్ పోలీసులు సమాజంలో నేరాలను అరికట్టేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం వినోబా నగర్, రెల్లివాడ, లెనిన్ నగర్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాల యజమానులకు జరిమానాలు విధించారు.
ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా ఉండటంతో, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అలాగే, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులను తెరవద్దని, ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని ప్రజలను కోరారు.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు పంపడం, ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టడం ద్వారా మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు భద్రతా చర్యలు పాటించాలని, వాహనదారులు తప్పనిసరిగా పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు.
వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలి వెళ్లవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ పేర్కొన్నారు. ప్రజల సంరక్షణ, భద్రత కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.











